న్యూజిలాండ్ పరిశోధకులు అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్‌ను కనుగొన్నారు. దేశ దక్షిణ ద్వీపానికి తూర్పు తీరంలో ఇది శాస్త్రవేత్తల కంటపడింది. నిజానికి ఇవి షార్క్స్ కాదని.. ఆ జాతులను పోలిన జీవులని పరిశోధకులు అంటున్నారు.
ఆస్ట్రేలియా ఖండంలోని అనేక ప్రాంతాల్లో తరచుగా చిన్నారులు పాడుకునే పాటల్లో తరచుగా వినిపించే పదం.. దెయ్యం చేప (Ghost Shark).. కథల్లో వినిపించే ఈ చేప కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఈ ఘోస్ట్ షార్క్‌లను చిమెరాస్ అని కూడా పిలుస్తారు. సముద్రాల్లో ఉండే అనేక రకాల జీవుల్లో ఈ దెయ్యం చేప కూడా ఒకటి. నిజానికి ఇదోరకమైన షార్క్ చేప. దీనిని ఇటీవల న్యూజిలాండ్ లోని తూర్పు సముద్ర తీరంలో కనిపెట్టారు పరిశోధకులు. ఇది సముద్రాల్లో అత్యంత లోతున కనిపించే చేప. ఈ చేపలు అత్యంత అరుదుగా మానవుల కంట పడతాయి. వీటిని దెయ్యం చేప అని పిలవడానికి ఓ కారణం ఉంది. వీటి శరీరం లోపలి భాగాలు బయటకు కనిపించి.. చూడటానికి భయంకరంగా ఉంటాయి. ఇవి సాధారణంగా సముద్రం లోపల 6,000 అడుగుల (1,829 మీటర్లు) లోతులో నివసిస్తాయి.
ఈ క్రమంలో న్యూజిలాండ్ (New Zealand) దక్షిణ ద్వీపానికి (South Island) తూర్పు తీరాన ఉన్న సముద్రంలో 1.2 కి.మీ లోతులో దీనిని కనుగొన్నారు. ఈ షార్క్ ఇటీవలే పొదగబడి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి ఇవి షార్క్స్ కాదని.. ఆ జాతులను పోలిన జీవులని తెలిపారు. వీటికి, షార్క్స్‌కి అస్తిపంజరాలు ఉండవని.. ఇవి మృదులాస్థిని కలిగి ఉంటాయని చెప్పారు. చాలాకాలంగా మెరైన్ బయాలజిస్టులు ఘోస్ట్ షార్క్స్‌పై పరిశోధనలు జరుపుతున్నారు. వాటి స్వభావాన్ని, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న బేబీ ఘోస్ట్ షార్క్ ఆ పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా డా.ఫినుచి అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ... ఆ బేబీ ఘోస్ట్ షార్క్ నుంచి కొన్ని కణజాలాలను, జన్యువులను సేకరించి వాటిని విశ్లేషించనున్నట్లు తెలిపారు. ఇవి సముద్రపు అడుగు భాగంలో నత్తలు, పురుగులను తింటూ జీవిస్తాయని పేర్కొన్నారు. పెద్ద ఘోస్ట్ షార్క్‌లు 2 మీ. పొడవు ఉంటాయని ఆయన వెల్లడించారు. న్యూజిలాండ్ సైంటిస్టులు కనుగొన్న బేబీ షార్క్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
