ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాను నిలువరించేందుకు గాను అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన వివా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు (russia ukraine war) దెబ్బమీద దెబ్బ పడుతోంది. ప్రపంచానికి వ్యతిరేకంగా రష్యా అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఎంతగా వారించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (putin) వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలను (sanctions on russia) విధించాయి. అన్నివైపులా రష్యాను కట్టడి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాయి. అయినా సరే పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగలేదు. రష్యా ప్రవేశపెట్టిన ఫేక్ చట్టాన్ని ఆన్ లైన్ స్ట్రీమింగ్, సోషల్ ప్లాట్ ఫాంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ దిగ్గజం టిక్ టాక్ (tiktok), ప్రపంచ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ (netflix) రష్యాకు గట్టి షాక్ ఇచ్చాయి. రష్యాలో తమ సర్వీసులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షల్లో భాగంగా రష్యాతో రిలేషన్ బ్రేక్ చేస్తున్నాం. రష్యా తెచ్చిన ఫేక్ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’ అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశాయి. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌కు రష్యాలో మిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు. రష్యాలో నెట్ ఫ్లిక్స్ కొత్త యూజర్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆయిల్ రిఫైనర్లు రష్యాకు షాకిచ్చారు. ఈ మేరకు ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ (viva energy) మంగళవారం తెలిపింది. మాస్కోపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను అనుసరించి రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడానికి వివా అంగీకరించింది. షెల్ బ్రాండ్‌తో ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చర్యలను ఖండిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా.. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ మిత్రదేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడుతోంది. ఆ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. తద్వారా ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా మారింది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకుండా ఇలాగే ముందుకు సాగితే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పలు ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు ఉక్రేనియన్ తిరుగుబాటు ప్రాంతాలైన డొనెట్స్క్ మరియు లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 22న రష్యాపై US మరియు దాని మిత్రదేశాలు మొదట ఆంక్షలు విధించాయని Castellum.AI తెలిపింది.
ఇవేవి పట్టించుకోని రష్యా.. ఉక్రెయిన్ పై మిలిటరీ చర్యకు దిగుతున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది. దీంతో అమెరికా మిత్ర దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలను పెంచాయి. ప్రపంచంలోని వందలాది దేశాలు వీటిని అనుసరిస్తూ.. రష్యాపై ఆంక్షలు విధించాయి. ఫిబ్రవరి 22కి ముందు రష్యాపై 2,754 ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించిన తర్వాత రోజుల్లో 2,778 అదనపు ఆంక్షలు విధించాయని తెలిపింది. దీంతో రష్యాపై విధించిన మొత్తం ఆంక్షలు 5,532 కు చేరుకున్నాయని Castellum.AI పేర్కొంది
