జకార్తా:ఇండోనేషియాలోని జావా దీవిలో బుధవారంనాడు జరిగిన ప్రమాదంలో 26 మంది మరణించారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడడంతో 26 మంది మరణించారు.  మరో 35 మంది ఈ ఘటనలో గాయపడ్డారు.

పశ్చిమ జావాలోని ఇస్లామిక్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్ధులు తల్లిదండ్రులతో కలిసి బస్సులో తీర్థయాత్రలకు వెళ్లారు. బుధవారం నాడు రాత్రి సుమేడాంగ్ జిల్లాలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.

దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణీస్తున్న 26 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. 

బాధితులను లోయ నుండి వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బస్సు బ్రేకులు పనిచేయని కారణంగానే డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయినట్టుగా క్షతగాత్రులు తెలిపారు.