ప్రేమగా తెచ్చి పెంచుకుంటే.. ఓ పక్షి తన యజమాని ప్రాణాలే తీసేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఆ పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా గుర్తుంపు పొందింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్లోరిడా రాష్ట్రం గైయినెస్ విల్లే నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాసోవారి అనే పక్షిని తెచ్చి పెంచుకున్నాడు. అయితే.. అది శుక్రవారం తన యజమానిపై దాడి చేసి మరీ చంపేసింది. మృతుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ‘ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కనబడుతోంది. తనకు సమీపంలో జారిపడిన యజమానిపై కాసోవారీ దాడి చేసివుండొచ్చ’ని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

చూడటానికి ఈము పక్షిలా కనబడే కాసోవారీ దాదాపు 6 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు పెరుగుతుంది. ఎగరలేని ఈ భారీ పక్షి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో కనిపిస్తుంది. శాన్‌డియాగో జూ వెబ్‌సైట్ ప్రకారం... ఇవి చాలా ప్రమాదకరమైన పక్షి. దీని కాళ్లకు దాదాపు 10 సెంటీమీటర్లు పొడవుండే కత్తుల్లాంటి గోళ్లుంటాయి. ముప్పు వాటిల్లినప్పుడు వేగంగా స్పందించి ఒక్క దెబ్బతో సత్తా చూపగలదు.