కాబుల్: అమెరికా వాయు దళాల పొరపాటు 17 మంది పోలీసులను బలితీసుకుంది. ఉగ్రవాదుల శిబిరాలనుకుని ఆఫ్గన్ పోలీసుల శిబిరాలపై కాల్పులు  జరిపారు. ఈ ఘటనలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన 17 మంది పోలీసులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

శుక్రవారం రాత్రి ఆఫ్గనిస్థాన్ రక్షణ దళాలకు తాలిబన్ లకు మధ్య భీకర పోరు జరిగింది. అయితే ఈ ఆఫ్ఘన్ రక్షణ దళాలకు మద్దతుగా అమెరికాకు చెందిన సైనికులు తాలిబన్లపై యుద్ధానికి దిగారు. అయితే ఉగ్రవాదుల క్యాంపులపై కాల్పులు జరపాల్సి ఉండగా, ఆఫ్గన్ రక్షణ దళ క్యాంపులపై మెరుపు దాడులు జరిపారు. 

ఈ కాల్పుల్లో 17 మంది మరణించడం జరిగింది. అమెరికా వాయు దళాలు చేసిన దాడుల్లో 35 మంది ఆఫ్గన్ పోలీసులు మరణించినట్లు తాలిబన్‌కు చెందిన క్వారి యూసఫ్ అహ్మదీ తెలిపారు. అయితే ఈ విషయమై మరింత విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు బయటపెడతామని ఒమర్ జ్వాక్ అనే అధికారి స్పష్టం చేశారు.