అమెరికా నిఘా విభాగం చీఫ్ విలియం జే బర్న్స్ తాలిబాన్ టాప్ లీడర్ అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. అమెరికా మిత్రపక్షాలు, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలూ యూఎస్, నాటో బలగాలు ఆగస్టు 31వ తేదీ గడువు తర్వాత కూడా ఆ దేశంలో ఉండాలనే అభ్యర్థనల నడుమ ఈ సమావేశం జరిగింది. పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంచే అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో రక్త నెత్తురులై పారడానికి, తాలిబాన్లు ఆక్రమించుకోవడానికి ప్రధానకారణంగా విశ్లేషకులు అమెరికా వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సేనలను వెనక్కి పంపించడానికి అమెరికా గూఢచార విభాగం సీఏఐ చేయని ప్రయత్నం లేదని వాదనలున్నాయి. ప్రలోభాలు, బెదిరింపులు, ఫండింగ్ మొదలు అడ్డదారులు తొక్కిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ చర్యల్లో భాగంగానే తాలిబాన్లు బలపడి, అల్ ఖైదా కూడా పుంజుకుందని కొన్ని అభియోగాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారాన్ని చేజిక్కించుకోవడం, అల్ ఖైదాకు ఆఫ్ఘనిస్తాన్ సురక్షితమైన అడ్డాగా మారడం వంటి ఆందోళనకర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని అమెరికానే పరోక్షంగా పెంచిపోషించిందనే ఆరోపణలున్నాయి. చివరికి అల్ ఖైదా అమెరికా నడిబొడ్డులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ట్విన్ టవర్స్‌ను కూల్చడాన్ని తాను పెంచిన పామే కాటేసిందన్న సామెతగా కొందరు ఉటంకించడం పరిస్థితిని తెలుపుతుంది. అల్ ఖైదా భరతం పట్టడానికి ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగైతే పెట్టింది కానీ, తీయడం అంత సులువు కాదని దానికి ఆలస్యంగా అర్థమైంది.
ఎట్టకేలకు దోహా ఒప్పందం మేరకు 20 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను వెనక్కి రప్పించుకుంటున్నది. ఆగస్టు 31 చివరి గడువుగా నిర్ణయించుకున్నది. కానీ, సేనలను, పౌరులను స్వదేశాలకు తీసుకువచ్చుకోవడమూ అనుకున్నంత సులభసాధ్యం కావడం లేదు. అందుకే తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గడువును మించి బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే అవకాశం ఏర్పడవచ్చని, పౌరుల తరలింపు ప్రక్రియ ముగిసిన తర్వాతే బలగాలు వెనక్కి వస్తారని చెప్పారు. వెంటనే తాలిబాన్ నుంచి ఊహించిన రీతిలో వార్నింగ్ వచ్చింది. గడువు మీరితే ఉపేక్షించబోమని, ఆగస్టు 31లోపు విదేశీ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ను వీడాల్సిందేనని, లేదంటే ఆ దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంగా హెచ్చరించింది.
ఇది అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి పెద్దదెబ్బగా భావిస్తున్నారు. అదిగాక, ఫ్రాన్స్ లాంటి కొన్ని అమెరికా మిత్రపక్షాలు యూఎస్, నాటో బలగాలు ఆగస్టు 31 తర్వాత కూడా ఇంకొంత కాలం అక్కడే ఉండాల్సిన అవసరముందని, సురక్షితంగా పౌరులను తరలించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వీటికితోడు ఆఫ్ఘనిస్తాన్ మిత్రపక్షాలూ తాలిబాన్ పాలనపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా బలగాలు ఉండాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా గూఢచర్య సంస్థ సీఏఐ చీఫ్ విలియం జే బర్న్స్ తాలిబాన్ టాప్ లీడర్ అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆగస్టు 31 గడువు పెంపుపై చర్చ జరిగి ఉండొచ్చని సంబంధితవర్గాలు కొన్ని వెల్లడించాయి. పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండటానికి వీలు కల్పించే ప్రతిపాదనను సీఏఐ డైరెక్టర్ విలియం జే బర్న్స్ తాలిబాన్ నేత ముందు బలంగా ఉంచినట్టు తెలుస్తున్నది. దీనిపై తాలిబాన్ల స్పందన ఏమిటనేది ఇప్పుడే తెలియరాలేదు. తాలిబాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ఒమర్‌తో అబ్దుల్ ఘనీ బరాదర్‌కు మంచి సాన్నిహిత్యముంది. బరాదర్ చెప్పిన మాట తాలిబాన్ నేతల్లో చెల్లుబాటవుతుంది. దోహా శాంతి చర్చల్లోనూ అబ్దుల్ ఘనీ బరాదర్‌దే కీలక పాత్ర. అందుకే సీఐఏ డైరెక్టర్ బరాదర్‌తో భేటీ అయ్యారు.
