Asianet News TeluguAsianet News Telugu

చైనాకు అమెరికా కౌంటర్.. 44 విమానాలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం

చైనాకు అమెరికా కౌంటర్ ఇచ్చింది. అమెరికా విమానాలను చైనా రద్దు చేసిన వారాల వ్యవధిలోనే షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. చైనాలో తొలిసారి స్థానికంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాగానే చైనా ప్రభుత్వం వేలాది విమానాలను రద్దు చేసింది. అందులో అమెరికా విమానాలూ ఉన్నాయి. చైనా విధించిన నిబంధనలు అన్నీ పాటించినా తమ విమానాలను రద్దు చేయడం సరికాదని ప్రకటించింది. అదే తరుణంలో 44 చైనా విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
 

america suspended 44 china flights in counter measures
Author
New Delhi, First Published Jan 22, 2022, 3:29 PM IST

న్యూఢిల్లీ: అమెరికా(America), చైనా(China) మధ్య సత్సంబంధాలు చాలా వరకు క్షీణించాయి. ట్రేడ్ వార్ సహా అనేక విధాల్లో ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కొరవడింది. తాజాగా, ఇది మరోసారి రూఢీ అయింది. ప్యాసింజర్ విమానాల(Flights)పై ఉభయ దేశాలు సస్పెన్షన్‌లపై సస్పెన్షన్‌లు విధించుకున్నాయి. ఒమిక్రాన్ కేసులు స్థానికంగానూ రిపోర్ట్ కావడంతో చైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది. వేలాది అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు (Suspend)చేసింది. అందులో అమెరికా విమానాలూ ఉన్నాయి. దీంతో అమెరికా ఆ నిర్ణయాన్ని చూస్తూ ఊరుకోలేదు. చైనాకు కౌంటర్‌గా చర్యలు తీసుకుంది. చైనా విమాన సంస్థలకు చెందిన 44 విమాన సేవలను అమెరికా రద్దు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో స్పష్టంగా చైనా నిర్ణయం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొంది.

గత వారంలో చైనాకు చెందిన ఓ నగరంలో స్థానికంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో వేలాది విమాన సేవలను చైనా రద్దు చేసింది. టెస్టుల సంఖ్యను పెంచింది. ఈ చర్యల్లోనే అమెరికాకు చెందిన విమానాలపైనా నిషేధం విధించింది. సర్క్యూట్ బ్రేకర్ పాలసీ కింద అమెరికా విమానాలను రద్దు చేసింది. అమెరికాలో వారి విమానం టేకాఫ్ సమయంలో కరోనా నెగెటివ్ అని వచ్చి.. చైనాలో దిగగానే కరోనా పాజిటివ్ అని వచ్చిన ప్రయాణికులను మోసుకొచ్చే విమానాలను రద్దు చేయాలనే విధానాన్ని చైనా ఎంచుకుంది. ఆ విధానం ప్రకారమే.. డెల్టా, అమెరికన్, యునైటెడ్ విమానయాన సంస్థల విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు రుచించిలేదు. పైపెచ్చు ఆగ్రహం తెప్పించింది. దీంతో కౌంటర్ మెజర్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయంలో నుంచే చైనాకు చెందిన విమానాలను రద్దు చేయాలనే ప్రకటన వెలువడింది. అమెరికా విమానయాన సంస్థలు చైనా విధించిన అన్ని నిబంధనలను అమలు చేశాయని, టేకాఫ్ సమయంలో.. ప్రయాణంలో పాటించాల్సిన అన్ని నిబంధనలను అనుసరించిందని వివరించింది. అయినప్పటికీ, అమెరికా విమానాలపై చర్యలు తీసుకోవడం సరికాదని తెలిపింది. విమానం నుంచి దిగిన తర్వాత చైనాలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలితే.. అమెరికా విమానాలను ఎందుకు శిక్షించాలని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఎయిర్ చైనా, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, షియామెన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 44 విమానాలను అమెరికా ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, అమెరికాలోని మయామి నుంచి లండన్‌కు గురువారం జెట్ లైనర్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం బయల్దేరింది. అందులో సుమారు 129 మంది ప్రయాణికులు ఉన్నారు. 14 మంది క్రూ ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఓ ప్రయాణికుడు మాస్క్(Mask) ధరించలేదని క్రూ గమనించారు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి మాస్క్ ధరించాల్సిందిగా కోరారు. కానీ, ఆయన మాస్క్ ధరించడానికి తిరస్కరించాడు. విమానంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నవారు తప్పకుండా మాస్క్ ధరించాలన్నది అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిబంధన. ఈ విషయాన్ని గుర్తు చేసినా.. ఆ ప్రయాణికుడు మాస్క్ పెట్టుకోవడానికి ససేమిరా అన్నాడు. ఎంత నచ్చజెప్ప ప్రయత్నించినా మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ఎయిర్‌లైన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ విమానాన్ని వెనక్కి రప్పించాల్సిందిగా నిర్ణయించుకుంది. లండన్‌కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని పైలట్లు మళ్లీ తిరిగి మయామికే వెళ్లిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios