వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నలుగురు అభ్యర్ధులు మరోసారి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున హౌస్ ఆఫ్ రిప్రజెంటిటివ్స్ కు పోటీ పడిన ఈ నలుగురు మరోసారి విజయం సాధించారు.

డాక్టర్ అమీబేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తరపున పోటీ పడి విజయం సాధించారు.అమెరికా మీడియా కథనం ప్రకారంగా బేరా 61 శాతం, జయపాల్ 84 శాతం, రో ఖన్నా 74.1 శాతం, రాజా కృష్ణమూర్తి 71.1 శాతం ఓట్లతో విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు భారత సంతతికి చెందిన ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

డాక్టర్ హిరాజ్ తిపిర్నేని 50.3 ఓట్లతో తన సమీప ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీకి చెందిన డేవిడ్ స్నేవిరట్ పై 3 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఆయన ఆరిజోనా రాష్ట్రంలోని 6వ కాంగ్రెసీనియల్ జిల్లా నుండి పోటీ చేశారు.

హిరాజ్ తిపిర్నేని విజయం సాధిస్తే  ప్రతినిధుల సభకు ఎన్నికైన రెండవ భారతీయ అమెరికన్  మహిళగా రికార్డు సృష్టిస్తారు. 55 ఏళ్ల జయపాల్ 2016లో తొలిసారిగా ఎన్నికయ్యారు.సమోసా కాకస్ లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులుంటే నలుగురు హౌస్ ఆఫ్ రిప్రజెంటిటివ్స్ ప్రతినిధులు.

రోహిత్ ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ కు 2017 నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించారు. ఈ ఎన్నికల్లో ఆయన భారతీయ సంతతికి చెందిన రితేష్ టాండన్ పై విజయం సాధించారు.