అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీకి నిధులు సమకూర్చారని పీటీఐ నాయకుడు ఫరూఖ్ హబీబ్ ఆరోపించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పిఎంఎల్-ఎన్) అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ నుంచి నిధులు అందుకున్నట్లు పాక్ దేశ ఎన్నికల సంఘం పరిశీలన కమిటీ ముందు అంగీకరించారని హబీబ్ ఆరోపించారు. 

అప్పటి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గ్లోబల్ ఉగ్రవాది అయిన ఒసామా బిన్-లాడెన్ నుంచి నిధులు స్వీకరించడం ద్వారా పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యానికి షరీఫ్ తలుపులు తెరిచారని హబీబ్ పేర్కొన్నారు. 

గతవారం పిఎంఎల్-ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)పై విదేశీ నిధుల కేసుల విచారణ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ హబీబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పిఎంఎల్-ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు తమ దాతల వివరాలను అందించడంలో విఫలమయ్యారని పీటీఎల్ నాయకుడు ఫరూఖ్ హబీబ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మద్దతు ఇచ్చి, ఆర్థిక సాయం అందించారని పాకిస్తాన్ మాజీ రాయబారి అబిదా హుస్సేన్ గతవారం ఆరోపించారు. 

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా వరుసగా మూడుసార్లు పనిచేసిన నవాజ్ షరీఫ్, కశ్మీర్ లో జిహాద్ ను ప్రోత్సహించడానికి, భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఒసామా బిన్-లాడెన్ నుంచి డబ్బు అందున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1990-93, 1997-98, 2013-17వరకు నవాజ్ షరీఫ్ ప్రధానిగా పనిచేశారు. 70ఏళ్ల నవాజ్ ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నారు. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు 2017లో ఆయనను అధికారం నుంచి తప్పించింది.