Asianet News TeluguAsianet News Telugu

Omicron: వింటర్ ఒలింపిక్స్ ముందు.. బీజింగ్‌లో ఒమిక్రాన్ కలకలం

చైనాలో వింటర్ ఒలింపిక్ గేమ్స్ వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ, ఈ ఒలింపిక్స్‌కు కొన్ని వారాల ముందే చైనా రాజధాని బీజింగ్‌లో ఒమిక్రాన్ కలకలం రేపింది. బీజింగ్‌లో స్థానికంగా వ్యాపించిన తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 2,430 కాంటాక్టుల శాంపిళ్లను సేకరించినట్టు అధికారులు వివరించారు. వేగంగా వైరస్ కట్టడి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
 

ahead of winter olympics beijing reports first locally transmitted omicron variant case
Author
Beijing, First Published Jan 15, 2022, 11:48 PM IST

న్యూఢిల్లీ: చైనా(China)లో వచ్చే నెల 4వ తేదీ నుంచి వింటర్ ఒలింపిక్ గేమ్స్(Winter Olympic Games) జరగాల్సి ఉన్నాయి. కానీ, ఈ గేమ్స్ మరికొన్ని వారాల్లో జరగాల్సి ఉన్న తరుణంలోనే బీజింగ్‌(Beijing)లో ఒమిక్రాన్(Omicron Variant) కలకలం రేపింది. బీజింగ్‌లో తొలి ఒమిక్రాన్ స్థానిక కేసు నమోదైంది. బీజింగ్‌లో రిపోర్ట్ అయిన కరోనా కేసు ఒమిక్రాన్ వేరియంట్‌దేనని నిర్దారణ అయినట్టు చైనా అధికారిక మీడియా శనివారం వెల్లడించింది. బీజింగ్‌కు చెందిన పాంగ్ షింగ్‌వుకు సోకిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌గా ల్యాబ్ పరీక్షల్లో తేలిందని నగర హెల్త్ ఆఫీసర్స్ మీడియాకు తెలిపారు. దీంతో వెంటనే కట్టడి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రాంతం, పని చేస్తున్న ఆఫీసు నుంచి 2,430 మంది కాంటాక్టు శాంపిళ్లను తీసుకున్నట్టు పేర్కొన్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో చైనాలోని అన్ని నగరాలు కరోనా ఇన్ఫెక్షన్లపై నిఘాను మరింత పెంచాయి. 

ఈ నెలాఖరులో చైనాలో లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల కోసం విదేశాల నుంచీ చైనాకు పౌరులు విచ్చేస్తున్నారు. ఇలా విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వారి సంఖ్య పెరగడంతోపాటు స్థానికంగానూ ప్రజల ప్రయాణాలు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులకు తోడు.. అతి వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్ కేసులూ రిపోర్ట్ కావడంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతున్నట్టు వివరించారు.

ఈ నేపథ్యంలోనే సెలవుల్లోనూ ప్రజలు అవసరమైతేనే తమ పట్టణాలు విడిచి బయటికి వెళ్లాలని స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. వీలైనంత వరకు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరుతున్నాయి. పదుల సంఖ్యలో అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేశారు. అయితే, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ సోకడమే ఇక్కడ సీరియస్‌గా చూస్తారు. కానీ, ఇప్పుడు బీజింగ్‌లో విదేశీ ప్రయాణాలు ఏమీ చేయని వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ సోకడం కలకలం రేపింది. కేవలం బీజింగ్‌లోనే కాదు.. మరో ఇతర నాలుగు ప్రావిన్స్‌లు, మున్సిపాలిటీల్లో స్థానికంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తియాన్‌జిన్ ఉత్తర భాగంలో, హెనాన్ సెంట్రల్ ప్రావిన్స్, గువాంగ్‌డాంగ్ దక్షిణ ప్రావిన్స్, లియోనింగ్ ఈశాన్య ప్రావిన్స్‌లలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే, మొత్తంగా చైనాలో ఎన్నిక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన విషయంపై క్లారిటీ లేదు. 

నేషనల్ హెల్త్ కమిషన్ అధికారి హి కింగువా మీడియాతో మాట్లాడుతూ షాంఘైలోనూ ఒమక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు వెల్లడించారు. కానీ, మరి షాంఘైలో మొత్తం ఎన్ని ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్న విషయాన్ని చెప్పలేదు. కాగా, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా స్థానికుల్లో రిపోర్ట్ అయిందా? లేక విదేశాల నుంచి వచ్చిన వారిలో రిపోర్ట్ అయిందా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 14 ప్రావిన్షియల్ ఏరియాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు వివరించారు.

జనవరి 14వ తేదీన దేశంలో 165 కొత్త కేసులు నమోదైనట్టు నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం వెల్లడించింది. అంతకు క్రితం రోజు కంటే కేసులు తగ్గాయి. అంతకు ముందటి రోజు దేశంలో కొత్త కేసులు 201 నమోదయ్యాయి. అయితే, కొత్త కేసులు 165లో 104 కేసులు స్థానికంగా వ్యాపించినవేనని ఆ కమిషన్ తెలిపింది. కాగా, జనవరి 14వ తేదీన చైనాలో 25 కొత్తగా అసింప్టమాటిక్ కేసులు నమోదయ్యాయి. చైనా దేశం.. అసింప్టమాటిక్ కేసులను కొత్త కేసుల్లో విడిగా వివరిస్తుంది. జనవరి 14వ తేదీ నాటికి చైనాలో మొత్తం కేసులు 104,745కు చేరాయి.

Follow Us:
Download App:
  • android
  • ios