మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పగ్గాలు.. ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..
బంగ్గాదేశ్ ఎన్నికల్లో (Bangladesh elections 2024) ప్రస్తుత ప్రధానికి చెందిన అవామీ లీగ్ పార్టీ ( Awami League party) ఘన విజయం సాధించింది. దీంతో నాలుగో సారి షేక్ హసీనా (Sheikh Hasina) ప్రధాని పీఠం ఎక్కనున్నారు. గోపాల్ గంజ్ -3 స్థానం నుంచి హసీనా ఎనిమిదో సారి విజయం సాధించారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని షేక్ హసీనా వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. దీంతో ఆమె మరో సారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా హసీనా రికార్డు సృష్టించనున్నారు. అయితే ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి.
వెంటనే మసీదులు ఖాళీ చేయండి.. లేకపోతే - బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు..
‘ఇండియా టుడే కథనం’ ప్రకారం.. పోలింగ్ కు ముందు అడపాదడపా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పాటు పలు పోలింగ్ బూత్ లకు, పాఠశాలలకు నిప్పుపెట్టారు. 300 స్థానాలున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ లో హసీనా పార్టీ ఇప్పటి వరకు 224 స్థానాలను గెలుచుకుంది. 62 స్థానాల్లో ఇండిపెండెంట్లు, జతియో పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానాన్ని మరో పార్టీ గెలుచుకుంది. ఇంకా రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫలితాలతో అవామీ లీగ్ విజేతను ప్రకటించవచ్చని, అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ప్రకటన చేస్తామని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
గోపాల్ గంజ్ -3 స్థానం నుంచి హసీనా ఎనిమిదో సారి విజయం సాధించారు. ఆమె అక్కడి నుంచి 1986 లో మొదటి సారిగా గెలుపొందారు. ఆమెకు 2,49,965 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం.నిజాం ఉద్దీన్ లష్కర్ కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ మంగళవారం నుంచి శాంతియుత ప్రజా భాగస్వామ్య కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని యోచిస్తోంది. 2014 ఎన్నికలను కూడా బీఎన్పీ బహిష్కరించింది. 2018లో మాత్రం ఎన్నికల్లో పాల్గొన్నది. ఈ సారి ఆ పార్టీతో పాటు మరో 15 రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. తమ బహిష్కరణ ఉద్యమం విజయవంతమైందనడానికి తక్కువ ఓటింగ్ నిదర్శనమని ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పారు. శాంతియుత ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, దీని ద్వారా ప్రజల ఓటు హక్కును ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
కాగా.. బీఎన్పీ, జమాతే ఇస్లామీ ఎన్నికలను బహిష్కరించడాన్ని బంగ్లాదేశ్ ప్రజలు తిరస్కరించారని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ పేర్కొన్నారు. విధ్వంసం, అగ్నిప్రమాదాలు, ఉగ్రవాదం వంటి భయాన్ని ధైర్యంగా ఎదుర్కొని 12వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని క్వాడర్ పేర్కొన్నారు.