రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ముస్లింలు ఇంట్లోనే ఉండాలి - ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు
Badruddin Ajmal : అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలందరూ జనవరి 20 నుండి 25 వరకు ఇళ్లలోనే ఉండాలని కోరారు. బీజేపీ ముస్లిం సామాజిక వర్గానికి అతిపెద్ద శత్రువు అని ఆరోపించారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తున్న వేళ, అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని ఏఐయూడీఎఫ్ చీఫ్, లోక్ సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ముస్లింలు జనవరి 20 నుండి 25 వరకు ఇళ్లలోనే ఉండాలని కోరారు. తమ సామాజిక వర్గానికి బీజేపీ అతి పెద్ద శత్రువు అని ఆయన ఆరోపించారు.
అస్సాంలోని బార్‌పేటలో జరిగిన సభలో అజ్మల్ ప్రసంగిస్తూ.. రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో జాగ్రత్త అవసరమని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా లక్షలాది మంది ప్రయాణిస్తారని తెలిపారు. కాబట్టి ముస్లిం సమాజం ప్రయాణానికి దూరంగా ఉండాలని కోరారు. శాంతిని కాపాడాలని అన్నారు. ‘‘బీజేపీకి పెద్ద ప్లాన్ లు ఉన్నాయి. జనవరి 20 నుండి 24-25 వరకు ప్రయాణం చేయవద్దని ముస్లిం సోదరులను కోరుతున్నాను.’’ అని అన్నారు.
ముస్లింల జీవితాలు, విశ్వాసం, ప్రార్థనలు, మదర్సా, మసీదు, తల్లులు, సోదరీమణుల 'పర్దా', ఇస్లామిక్ చట్టాలు, తలాక్‌లకు బీజేపీ శత్రువు అని బద్రుద్దీన్ అజ్మల్ ఆరోపించారు. అయోధ్యలో మసీదు కూల్చివేత ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో శాంతి, సామరస్యాలను కాపాడేందుకే ఈ విజ్ఞప్తి చేశామని ఆయన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన స్పష్టం చేశారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. బీజేపీ 'సబ్ కా సాథ్ సబ్ కా విశ్వాస్' అనే మంత్రంపై ఆధారపడి పని చేస్తుందని చెప్పారు. బీజేపీకి ముస్లింలంటే ద్వేషం లేదన్నారు.‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రంతో పనిచేస్తాం. అయోధ్య భూవివాదం కేసులో మాజీ పిటిషనర్ ఇక్బాల్ అన్సారీని రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన కూడా ప్రార్థనల్లో పాల్గొంటారు. బద్రుద్దీన్ అజ్మల్, ఒవైసీ వంటి వారు సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేశారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది’’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ఇదిలా ఉండగా.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలోని రామ్ లల్లా (బాల రాముడు ) ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు వారం ముందు జనవరి 16 న ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది.జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనాలని దేశవిదేశాలకు చెందిన పలువురు వీవీఐపీ అతిథులకు ఆహ్వానాలు అందాయి.