Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అలీ అహ్మద్ జలాలీ

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వీడటంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా అలీ అహ్మద్ జలాలీ బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. ఈయన కాబూల్‌లో జన్మించినప్పటికీ 1987లో అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.

afghan interim head to be jalali as prez left the country
Author
New Delhi, First Published Aug 15, 2021, 8:43 PM IST

న్యూఢిల్లీ: ఎట్టకేలకు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్నారు. ఎన్నికైన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదలి తజకిస్తాన్ వెళ్లిపోయాడు. తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ అహ్మద్ జలాలీ బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. తాలిబన్ డిప్యూటీ లీడర్ ముల్లా బరదర్ కాబూల్ చేరుకున్నారు. జలాలీతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాబూల్ ఆక్రమించుకునే ప్రణాళికలేవీ లేవని, చర్చల ద్వారానే అధీనంలోకి తెచ్చుకుంటామని వివరించారు. శాంతి చర్చల కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని మాజీ అధ్యక్షుడని సంభోదిస్తూ ఆయన దేశం వీడి తజకిస్తాన్ వెళ్లినట్టు వెల్లడించారు. భేషరతుగా అధికారాన్ని అప్పగించాలన్న తాలిబన్ల డిమాండ్ నేపథ్యంలో ఘనీ దేశం వదిలి వెళ్లారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ఆ దేశంలో కనుమరుగైనట్టయింది. తాత్కాలికంగా దేశ బాధ్యతలు తీసుకున్న అలీ అహ్మద్ జలాలీ కాబూల్‌లో జన్మించినప్పటికీ 1987 తర్వాత అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.

నెల రోజుల క్రితం వరకు చెదురుమదురు ఘటనలే అన్నట్టుగా తాలిబన్ల దాడులు కనిపించాయి. కానీ, రెండు వారాల నుంచి గంట గంటకు పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆదివారం అనూహ్యంగా ప్రభుత్వమే లొంగిపోయే పరిస్థితి వచ్చింది. తాలిబన్లను ఎదిరించి తీరుతామని, దీటుగా నిలబడతామని ప్రకటించిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రోజుల వ్యవధిలోనే అధికారాన్ని పంచుకునే ప్రతిపాదన చేశారు. తాలిబన్లు దీన్ని అంగీకరించకుండా తమ దూకుడు కొనసాగారు. ఆదివారం నలువైపుల నుంచి రాజధాని నగరం కాబూల్‌ను చట్టుముట్టారు. కాబూల్‌లో దాడులు చేయబోమని, అధికారాన్ని శాంతియుతంగా చేజిక్కించుకుంటామని ముందుగానే ప్రకటించిన తాలిబన్లు అధికారాన్ని పంచుకుంటామని ప్రతిపాదనను స్పష్టంగా తోసిపుచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios