Asianet News TeluguAsianet News Telugu

Pakistan: పాకిస్తాన్ సిగ్గు పడాల్సిన రోజు.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

పాకిస్తాన్‌లో ఓ శ్రీలంక పౌరుడిని సజీవ దహనం చేయడం కలకలం రేపింది. అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ దేశం సిగ్గు పడాల్సిన రోజు అది అని పేర్కొన్నారు. తను స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. అరెస్టు జరుగుతున్నాయని వివరించారు.

a day of shame for pakistan says PM Imran Khan on lynching srilankan
Author
Islamabad, First Published Dec 4, 2021, 2:50 PM IST

న్యూఢిల్లీ: Pakistan గత రెండు మూడు రోజులుగా ఎక్కువగా వార్తల్లో నానుతున్నది. ఆ దేశ ఎంబసీ కార్యాలయమే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేసిన తర్వాత దుమారం రేగింది. దీంతోపాటు ఆ దేశంలో ఓ Srilanka జాతీయుడిని ఓ మూక దాడి(Lynching) చేసి నడి రోడ్డుపై ఆయనను సజీవ దహనం చేశారు. ఆ మృతదేహం కాలుతుంటే కొందరు ఏకంగా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియా(Social Media)లో పోస్టు చేశారు. ఈ ఘటన అంతర్జాతీయంగా వ్యతిరేకతను తెచ్చింది. దీనిపై తాజాగా, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇది పాకిస్తాన్ దేశం సిగ్గు పడాల్సిన రోజు అంటూ ట్వీట్ చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు.

ఇస్లామాబాద్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో సియాల్‌కోట్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఆ శ్రీలంక పౌరుడు దైవ దూషణకు పాల్పడ్డాడని అందులో వారు ఆరోపణలు చేశారు. ఆ పౌరుడి కారును ధ్వంసం చేశారు. అతడిని చితకబాదారు. అనంతరం ఆయన బాడీకి నిప్పు పెట్టి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఘటనలో 50 మంది నిందితులను అరెస్టు చేసినట్టు పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును 48 గంటల్లో పూర్తి చేయాలనే ఆదేశాలు వచ్చాయని, తాము ఘటనాస్థలిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వివరించారు.

Also Read: పాకిస్తాన్ ప్రభుత్వానికి అవమానం.. ఇమ్రాన్ ఖాన్‌పై ఎంబసీ ట్రోలింగ్.. ‘మీరు చెప్పే నూతన పాకిస్తాన్ ఇదేనా?’

పాకిస్తాన్‌లో చిన్నపాటి విమర్శ కూడా పెద్ద ఘర్షణకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా దైవానికి సంబంధించి అతిసున్నితమైన వ్యవహారంగా మారింది. తెహ్రీక్ ఎ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ) సారథ్యంలో ఇది మరింత తీవ్రంగా మారుతున్నట్టు తెలుస్తున్నది. ఇది దైవదూషణను ఎంత మాత్రం.. చిన్నపాటి విమర్శనూ సహించని పార్టీ. మొన్నటి వరకు దీనిపై నిషేధం ఉన్నది. గత నెలలోనే దీనిపై నిషేధం ఎత్తేశారు. ఈ నేపథ్యంలోనే సియాల్‌కోట్ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్యారిస్‌కు చెందిన చార్లీ హెబ్డో పత్రిక కూడా ప్రొఫెట్ మొహమ్మద్‌పై వ్యంగ్య కార్టూన్‌లు వేయడాన్ని గతేడాది ఈ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేవలం ఐదేళ్లలో ఈ పార్టీ పాకిస్తాన్‌లో వేగంగా దాని ప్రభావాన్ని వ్యాపింపజేసింది. ఇది దేశ అతివాద గ్రూపులకు సంబంధించి కొత్త ముప్పునకు దారి తీసే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి.

అంతర్జాతీయంగానూ వ్యతిరేకత రావడంతో తాజాగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. సియాల్‌కోట్ ఫ్యాక్టరీపై భయానక దాడి.. శ్రీలంకకు చెందిన మేనేజర్‌ను సజీవంగా దహనం చేసిన రోజు పాకిస్తాన్ దేశానికే ఒక సిగ్గుపడాల్సిన రోజు అని ట్వీట్ చేశారు. తాను స్వయంగా ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో దోషులుగా తేలినవారిని చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అరెస్టులు ఇంకా జరుగుతున్నాయని తెలిపారు.

Also Read: Delhi Pollution: పాక్ నుంచే కలుషిత వాయువులు.. అక్కడ పరిశ్రమలు నిషేధిద్దామా?: సుప్రీంకోర్టులో వాదనలు

దేశంలో ద్రవ్యోల్బణం గత రికార్డులన్నింటినీ చెరిపేస్తున్నదని సెర్బియాలోని పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం నిన్న మండిపడింది. ‘మమ్మల్ని ఇంకా ఎంత కాలం మౌనంగా పని చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేదని మా పిల్లలను స్కూల్ నుంచి బయటకు గెంటేస్తున్నారు. అయినా ఇంకా ఎంత కాలం నోరుకు తాళం వేసుకోవాలని అనుకుంటున్నారు. ఇదేనా నూతన పాకిస్తాన్ అంటే?’ అంటూ ట్వీట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios