యూత్ ఐకాన్ చే గువేరా ను కాల్చి చంపినట్టుగా పిలిచే బొలివియా మాజీ సైనికుడు మారియో టెరాన్ సలాజర్ అనారోగ్యంతో మరణించారు. చే గువేరా 1967లో మరణించినప్పటికీ ప్రపంచం ఆయనను ఇప్పటికీ మరచిపోలేదు. ముఖ్యంగా యువత చే గువేరాను ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటుంది. 

మార్క్సిస్ట్ విప్లవ వీరుడు ఎర్నెస్టో చే గువేరా (Che Guevara) ను కాల్చి చంపినట్లుగా పేర్కొన్న బొలీవియా (Bolivia) మాజీ సైనికుడు మారియో టెరాన్ సలాజర్ (Mario Teran Salazar) గురువారం 80 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయ‌న మ‌ర‌ణాన్నిబంధువులు ధృవీక‌రించారు. అయితే వైద్య గోప్యత కారణంగా టెరాన్ మరణంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి నిరాకరించింది. మారియో టెరాన్ స‌లాజ‌ర్ చే గువేరాను అక్టోబర్ 9, 1967న బొలీవియాలోని తూర్పు శాంటా క్రూజ్ ప్రావిన్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధంలో కాల్చి చంపాడు.

చే గువేరాను తాము ప‌ట్టుకున్నామ‌ని అయితే అత‌డు అనారోగ్యంతో ఉండ‌టంతో అత‌డు మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేక‌పోయాడ‌ని 54 సంవత్సరాల క్రితం అడవి ప్రాంతంలో గువేరాను పట్టుకోవడంలో సహాయం చేసిన మాజీ బొలీవియన్ సైనికుడు గ్యారీ ప్రాడో AFPకి తెలిపారు. 

గువేరాను ఇద్దరు క్యూబా-అమెరికన్ CIA ఏజెంట్ల సహాయంతో బొలీవియన్ సైన్యం అక్టోబర్ 8, 1967న బంధించింది. గువేరా ఆ స‌మ‌యంలో ఆకలి, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గెరిల్లాల చిన్న బృందానికి నాయకత్వం వహించాడు. గాయపడిన గువేరాను బందించి లా హిగువేరా గ్రామంలోని పాడుబడిన పాఠశాలకు తీసుకువచ్చారు. అయితే ఆయ‌న రాత్రి అక్క‌డే గడిపాడు.

అయితే మరుసటి రోజు తీవ్ర కమ్యూనిస్ట్ వ్యతిరేకి అయిన అప్పటి ప్రెసిడెంట్ రెనే బారియంటోస్ (Rene Barrientos) (1964-69) చే గువేరాను చంపేయాలి ఆదేశించారు. చే బ‌తికిఉండ‌టం అంత మంచిది కాద‌ని తెలిపారు. దీంతో ఆయ‌నను గ‌న్ తో టెరాన్ కాల్చి చంపాడు. దీంతో ఆయ‌న‌కు ఒక ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ‘‘ అది నా జీవితంలో అత్యంత నీచమైన క్షణం. ఆ సమయంలో చే పెద్దవాడిగా, భారీగా, అపారంగా కనిపించాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆయ‌న నా వైపు స్థిరంగా చూశారు. అయితే అత‌డు నన్ను ఒకే క‌ద‌లిక‌తో నిరాయుధుడిని చేయ‌గ‌ల‌డని నేను అనుకున్నాను. కానీ అలా చేయలేదు’’ అని టెరాన్ తరువాత కాలంలో చెప్పాడు. ‘‘ అయితే ఆయ‌న నాతో ఇలా అన్నాడు. బాగా గురి పెట్టండి.మీరు ఒక వ్యక్తిని చంపబోతున్నారు. దీంతో నాకు బాధగా అనిపించింది. దీంతో నేను తలుపు వైపు తిరిగి, కళ్ళు మూసుకుని కాల్చాను.’’ అని టెరాన్ తెలిపారు. 30 సంవత్సరాల ఆర్మీ సర్వీస్ తర్వాత టెరాన్ మీడియా నుంచి తప్పించుకుంటూ తిరిగాడు. 

అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించిన చే గువేరా మెడిసిన్ చదివి లాటిన్ అమెరికా అంతటా పర్యటించారు. ఆయ‌న‌ మెక్సికోలో క్యూబా (Cuba) సోదరులు ఫిడేల్ (Fidel). రౌల్ కాస్ట్రో (Raul Castro) ను కలుసుకున్నారు. 1959లో US-మద్దతుగల నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను తొలగించి క్యూబాలో అధికారాన్ని చేజిక్కించుకున్న వారి విప్లవ సైన్యంలో చేరాడు. గువేరా తరువాత కాలంలో కాంగో. బొలీవియాలో మార్క్సిస్ట్ విప్లవాలను ప్రేరేపించడానికి ప్ర‌య‌త్నం చేశారు.