కొలంబో: ఐఎస్ఐఎస్ స్థావరంపై శ్రీలంక భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ దాడి సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో 15 మరణించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలున్నారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో కాల్మునాయ్ లోని ఓ ఇంటిపై శ్రీలంక భద్రతా  బలగాలు శుక్రవారం రాత్రి దాడి చేశాయి. 

స్థావరం బయట మరణించినవారిలో ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. ఇంటిపై దాడి చేసిన సమయంలో గంటకు పైగా ఎదురుకాల్పులు జరిగాయి. సోదాలు నిర్వహించగా శనివారం ఉదయం మృతదేహాలు కనిపించాయి. 

చీకటిని ఆసరా చేసుకుని ఇంటిపై దాడి చేస్తున్న క్రమంలో ఉగ్రవాదాలు కాల్పులు జరిపారని, దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని, ఇందులో ఓ పౌరుడు కూడా మరణించాడని సైనిక అధికార ప్రతినిధి సుమిత్ ఆటపట్టు చెప్పారు. 

ఈస్టర్ పర్వదినాన దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో పోలీసుల సాయంతో భద్రతా బలగాలు స్థావరంపై దాడి చేశాయి. దాడులు జరిగిన తర్వాత ఐఎస్ఐఎస్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించింది. ఆ వీడియో రికార్డు చేసిన ఆనవాళ్లు కూడా స్థావరంలో ఉన్నట్లు చెబుతున్నారు.