ఉక్రెయిన్ నగరాలపై, ఉక్రెయిన్ ప్రజల నివాసాలపై రష్యా దాడులు చేస్తున్నది. ఏకంగా 500 కిలోల బాంబులను నివాసాలపై వేస్తున్నది. సుమీలో ఇలాంటి ఓ బాంబు పడి ఇద్దరు పిల్లలు సహా 18 మంది మరణించారు. కాగా, మరో చోట కూడా ఇలాంటి బాంబ్ పడి పేలిపోలేదు. ఆ బాంబు చిత్రాన్ని ఉక్రెయిన్ మంత్రి ట్వీట్ చేశారు. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ (Ukraine) పై రష్యా (Russia) దారుణంగా దాడులు జరుపుతున్నది. విచక్షణారహితంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నది. తాము ప్రజలను టార్గెట్ చేసుకోలేదని, కేవలం సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటున్నామని, ఇది అసలు యుద్ధమే (War) కాదని, కేవలం సైనిక చర్య (Military Operation) మాత్రమేనని రష్యా చెబుతున్న మాటలు అవాస్తవాలేనని మళ్లీ మళ్లీ రుజువు అవుతున్నాయి. తాజాగా, మరోసారి ఇదే విషయం స్పష్టం అయింది. రష్యా సేనలు నివాసాలపై ఏకంగా 500 కిలోల బాంబ్‌ను వేసింది. సుమీ నగరంలో నివాసాలుపై 500 కిలోల బాంబ్ వేశారని, ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించినట్టు ఉక్రెయిన్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ పాలసీ వెల్లడించింది. గత రోజు రాత్రి రష్యా పైలట్లు మానవాళిపై మరో యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఆ శాఖ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. నివాస భవనాలపై వారు 500 కిలోల బాంబ్ (500 Kg Bomb) వేశారని తెలిపింది. ఇందులో ఇప్పటికే 18 మంది పౌరులు మరణించారని వివరించింది.

ఇలాంటి 500 కిలోల బాంబ్‌లు మరికొన్ని చోట్ల నివాసాలపై కూడా పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి దిమిత్రి కులేబా తెలిపారు. ఆయన ఇలాంటి 500 కిలోల బాంబ్‌ చిత్రాన్ని ట్వీట్ చేశారు. అదే ట్వీట్‌కు తన ఆందోళననూ జత చేశారు. చెర్నిహివ్ నగరంలో నివాసాలపై 500 కిలోల రష్యన్ బాంబ్ పడిందని వివరించారు. కానీ, అది ఇంకా పేలలేదని తెలిపారు. కాగా, ఎన్నో ఇతర బాంబులు పేలాయని వివరించారు. ఈ పేలుళ్లలలో ఎంతో మంది చిన్నారులు, పురుషులు, మహిళలు మరణించారని పేర్కొన్నారు. రష్యా అనాగరికతనం నుంచి తమ పౌరులను రక్షించడానికి సహరించాలని ఆయన కోరారు. రష్యా వైమానిక సేనలు తమపై దాడి చేయకుండా ఉక్రెయిన్ గగనతలాన్ని వారికి మూసేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు యుద్ధ విమానాలనూ అందించాలని కోరారు. ఏదైనా సరే.. ఉక్రెయిన్ కోసం సహకరించాలని ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

తూర్పు, మధ్య ఉక్రెయిన్‌లపై రష్యా వైమానిక బృందాలు బాంబులతో దాడులు చేశాయని స్థానిక అధికారులు తెలిపారు. సుమీ, ఒక్తిర్కా నగరాలపై రష్యా బాంబులు వేసిందని, అవి ఆ నగరాల్లోని నివాసాలపై పడ్డాయని పేర్కొన్నారు. ఆ బాంబులు పవర్ ప్లాంట్‌నూ నాశనం చేశాయని రీజినల్ లీడర్ దిమిత్రో జివిత్‌స్కీ తెలిపారు. ఈ బాంబుల దాడులతో చాలా మంది మరణించారని చెప్పారు. కానీ, ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.