పాకిస్తాన్‌లో మైనార్టీలుగా వున్న హిందూ కుటుంబాలపై దారుణాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ముల్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రహీమ్‌యార్‌లోని అబుదాబి కాలనీలో హిందూ వర్గానికి చెందిన రామ్‌ చంద్‌ టైలరింగ్‌ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు గుర్తు తెలియని దుండగులు అతడి ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఘటనా స్థలంలో నిందితులు వాడిన కత్తులు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, వీరి కుటుంబం ప్రశాంతమైన జీవనం గడుపుతూ, అందరితోను కలిసిమెలిసి ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ హత్యపై పాకిస్తాన్‌లోని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.