అమెరికాలో నిరుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 22 ఏళ్ల యువతి.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలయ్యింది. అదృష్టం వరించడంతో ఏకంగా సుమారు ఏడు కోట్ల రూపాయలను గెలుచుకుంది. దీంతో ఆ యువతి ఉబ్బితబ్బిబ్బైపోతోంది.

విషయంలోకి వెళితే... అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జో బైబెన్ కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గమని జో బైడెన్ గట్టిగా నమ్మారు. 

లక్ష్యాలను నిర్దేశించుకుని మరి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు పెట్టించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించుకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 

జూలై 4 నాటికి డెబ్భై శాతం మంది యువతకు (18 ఏళ్లు పైబడిన వారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్..  యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. దీంతో అమెరికాలోని ఓహియో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.

యువతను వ్యాక్సిన్‌వైపు మళ్లించేందుకు భారీ ఆఫర్ ప్రకటించింది. ‘వ్యాక్స్ ఏ మిలియన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న యువతను లాటరీ విధానంలో ఎంపిక చేసి విద్యార్థులకు ఒక మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లుపై దుమారం...పోలీసుల దర్యాప్తు, ఏం జరిగిందంటే.......

ఈ నేపథ్యంలోనే గత ఏడాదే ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నా అబ్బి‌గైల్ బుగెన్స్కే అనే 22 ఏళ్ల యువతి తన తొలి డోసు తీసుకుంది. ఈ యువతిని అదృష్టం వరించడంతో జాక్పాట్ కొట్టింది. 

‘వ్యాక్స్ ఏ మిలియన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం డ్రా తీసిన ఓహియో రాష్ట్ర గవర్నర్... లాటరీలోఅబ్బి‌గైల్ బుగెన్స్కే ఒక మిలియన్ డాలర్లను గెలుచుకున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ విషయాన్ని స్వయంగా గవర్నరే ఫోన్ ద్వారా చెప్పడంతో యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇలా ఉండగా... మరో నాలుగు వారాల పాటు ‘వ్యాక్స్ ఏ మిలియన్’ కార్యక్రమం కొనసాగుతుందని... మరో నలుగురు విజేతలను ఎంపిక చేసి వారికి కూడా వన్ మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.