ఆఫ్రికా దేశం ఘనాలో విషాదం చోటు చేసుకుంది. చర్చి కూలి 22 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఘనాలోని ఆరంతస్తుల భవనంలో చర్చిని నిర్వహిస్తున్నారు.

అయితే శుక్రవారం ఈ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో చర్చిలో 60 మంది ప్రార్థన చేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు.

అయితే మట్టి శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారని .. మిగతావారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. భవన నిర్మాణం నాసిరకంగా ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.