అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫ్లొరిడా రాష్ట్ర రాజధాని టల్లాహస్సీలోని యోగా స్టూడియోలో ఓ దుండగడు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కాగా.. అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్నామని అయితే అప్పటికే పలువురు గాయలతో అక్కడ పడిపోయి ఉన్నారని పోలీసులు చెప్పారు. 

వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఇద్దరు ఘటన స్థలిలోనే మృతి చెందారని పేర్కొన్నారు. అయితే మృతుల్లో ఒకరు దుండగుడున్నాడని గుర్తించామని, అతను తనకు తనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఘటనస్థలిలో చాలా మంది దుండగుడితో పోరాడారని, తమ ప్రాణాలతో పాటు ఇతరులను రక్షించటానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.