ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని సింధునదిలో వ్యాన్ పడిపోయిన ఘటనలో 17 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీల వెలికితీతకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ లోని  పానిబా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఒకే కుటుంబానికి చెందిన వారంతా వ్యాన్ అద్దెకు తీసుకొని టూర్‌కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు చెప్పారు.

పాకిస్తాన్ లోని చిలాస్ కు చెందిన ఓ కుటుంబం వ్యాన్ ను అద్దెకు తీసుకొంది. డ్రైవర్ తో పాటు 17 మంది చిలాన్ నుండి రావల్పిండికి బయలుదేరింది. అయితే మార్గమధ్యలోని కోహిస్తాన్ జిల్లాలో పానిబా వద్ద వ్యాన్ అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో మృతదేహల వెలికితీతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్క మృతదేహం మాత్రమే స్వాధీనం చేసుకొన్నారు.పాకిస్తాన్ లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 50 మంది మరణించిన ఘటన మరవకముందే సింధు నదిలో 17 మంది మరణించడం విషాదాన్ని నింపింది.