దక్షిణ సూడాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం పది రోజుల్లో 125మంది మహిళలు, బాలికలు అత్యాచారానికి గురయ్యారు.  అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్ లో మహిళలకు రక్షణ కరువైందని.. వారిపై  లైంగిక హింస పెరుగుతోంది అనడానికి ఇదే సాక్ష్యం. బెంటియూ అనే ప్రాంతంలో ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లగా వారిపై ఈ ఘోరం జరిగినట్లు డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. 

బాధితుల్లో గర్భిణీలు, వృద్ధులు, బాలికలున్నట్లు సహాయక కార్యకర్తలు తెలిపారు. ఈ ఘోరం గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.మహిళల దుస్తులు, పాదరక్షలు, రేషన్‌ కార్డులు లాక్కుని వారిపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు చెప్పారు. 

మిలిటరీ సిబ్బంది, సాధారణ పౌరులే ఈ దారుణాలకు ఒడిగడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి మిషన్‌ చీఫ్‌ డేవిడ్‌ షీర్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి పది నెలల కాలంలో అదే ప్రాంతంలో 104 మంది లైంగిక దాడి బాధితులకు వైద్యం అందించినట్లు డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ తెలిపింది.