Coronavirus: మూడు సెకన్లకు 100 మందికి కరోనా.. ఈ గేమ్ అప్పుడే ముగియలేదు !
Coronavirus: కరోనా విలయతాండవం కొనసాగుతోంది. దీని కారణంగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు సెకన్లకు 100 మందికి కరోనా సోకుతున్నదనీ, కరోనా ఇప్పట్లో ముగిసే గేమ్ కాదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. మరీ ముఖ్యంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. విజృంభిస్తున్నది. దీంతో చాలా దేశాల్లో కరోనా వైరస్ (Coronavirus) బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పరిశోధకులు హెచ్చిరిస్తూ.. మానవాలి ఎదుర్కొనబోయే వైరస్ లలో ఇదే చివరిది కాదని పేర్కొంటున్నారు. మరిన్ని కోవిడ్ వేరియంట్లు.. ముఖ్యంగా ఒమిక్రాన్ సంబంధిత లక్షణాలు కలిగినవి పుట్టుకొస్తాయని చెబుతున్నారు. అయితే, భారత్, బ్రిటన్, అమెరికా, పలు యూరప్ దేశాల్లో కరోనా పంజాతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అన్ని దేశాలను హెచ్చిరించింది.
కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నదనీ, కొత్త వేరియంట్ల పట్ల అలసత్వం వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా గత వారం సగటున ప్రతి మూడు సెకన్లకు 100 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయనీ, కరోనా మహమ్మారి అనేక రూపాంతరాలు చెందుతూ.. కొనసాగిస్తున్న ఈ గేమ్ ఇప్పుడే ముగింపు దశకు చేరుకుందని భావించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 150వ సెషన్ ప్రారంభంలో గ్లోబల్ హెల్త్ బాడీ హెడ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. కరోనా చివరి దశలో ఉన్నామని భావించవద్దని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదనీ, మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకు వచ్చే అవకాశముందని తెలిపారు. పలు దేశాలు కొత్త వేరియంట్లను తేలికగా తీసుకోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కొనసాగిస్తున్న గేమ్ లో ఒమిక్రాన్ వేరియంట్ చివరిది అని భావించడం సరికాదనీ అన్నారు. ఇమిక్రాన్ వేరియంట్ కేసులు కేవలం తొమ్మిది వారాల్లోనే 80 మిలియన్ల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా మరిన్ని వేరియంట్లు పుట్టుకురావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కోవిడ్ -19 వ్యాప్తిపై అంతర్జాతీయ చట్టం ప్రకారం అత్యున్నత స్థాయి హెచ్చరికలు చేస్తూ.. అంతర్జాతీయ ఆందోళనకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని WHO ప్రకటించి ఈ ఆదివారం నాటికి (జనవరి 30) రెండు సంవత్సరాలు పూర్తవుతున్నదని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కరోనా గ్లోబల్ హెల్త్ ఏమర్జెన్సీ ప్రకటించిన సమయంలో చైనా వెలుపల అన్ని దేశాల్లో కలిపి 100 కంటే తక్కువ కేసులు ఉన్నాయని పేర్కొన్న టెడ్రోస్.. రెండు సంవత్సరాల తర్వాత దాదాపు 350 మిలియన్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే, 5.5 మిలియన్లకు పైగా కోవిడ్-19 మరణాలు సంభవించాయని తెలిపారు. అయితే, కరోనాకు సంబంధించి కేసులు, మరణాల పై ఖచ్చితమైన డేటా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. "గత వారం సగటున, ప్రతి మూడు సెకన్లకు 100 కేసులు నమోదయ్యాయి. ప్రతి 12 సెకన్లకు ఒకరు COVID-19 కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు" అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.
ప్రపంచం భవిష్యత్తులో కోవిడ్-19తో జీవిస్తుందనేది 'నిజమే' అని WHO చీఫ్ అన్నారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కోసం నిరంతర, సమగ్ర పోరాట వ్యవస్థ ఏర్పాటుకోసం కృషి చేయాలని అన్నారు. "కానీ కోవిడ్‌తో జీవించడం నేర్చుకోవడం అంటే మనం ఈ వైరస్‌కు ఉచిత ప్రయాణాన్ని అందించడం కాదు. నివారించగల, చికిత్స చేయగల కరోనా సంబంధిత మరణాలను క్రమంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నాము" అని టెడ్రోస్ అన్నారు. దేశాలకు అవసరమైన సాక్ష్యాలు, వ్యూహాలు, సాధనాలు మరియు సాంకేతిక కార్యాచరణ మద్దతును అందించడానికి WHO జాతీయంగా, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా పని చేస్తూనే ఉందని ఆయన అన్నారు. ప్రతి దేశంలోని 70% జనాభాకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా, అత్యంత ప్రమాదంలో ఉన్న సమూహాలపై దృష్టి సారించడం ద్వారా ప్రపంచం కోవిడ్-19ని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ముగించగలదని టెడ్రోస్ చెప్పారు.