తల్లితో కలిసి ఆడుకోవడం.. అమ్మ చేతి గోరుముద్దలు  తినడం తప్ప.. సరిగా కూర్చొని తినడం కూడా చేతగాని వయసు. అలాంటి చిన్నారి.. గర్భం దాల్చింది. కనీసం తల్లి అవ్వడం అంటే ఏంటో కూడా తెలియని వయసులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానుష సంఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. కాగా.. ఆ చిన్నారిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల రోజుల క్రితం పదేళ్ల బాలిక మరో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తనపై అత్యాచారానికి పాల్పడింది ఎవరో మాత్రం సదరు బాలిక చెప్పలేకపోవడం గమనార్హం. ఎనిమిదో ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలయ్యిందని అధికారులు భావిస్తున్నారు. ప్రాడో మున్సిపాలిటిలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. 


ఈ క్రమంలో తొలిమా గర్నరర్‌ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీని గురించి ఆమె ఏం మాట్లడలేకపోతుంది. కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి(43), అక్కడే పొలాల్లో పని చేసే మరో వ్యక్తి(23)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇక ఇలాంటి దారుణాలు ఎక్కువగా బయటపడటం లేదు. చాలా కేసుల్లో కొడుకు, అంకుల్‌, తాత, సమీప బంధువులు నిందితులుగా ఉంటున్నారు. దాంతో ఈ దారుణాలను కప్పి పుచ్చుతున్నారు. ఇక కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్‌ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు’ అన్నారు.