అమెరికాలో తుపాకీ మోత మరోసారి వినపడింది. మరోసారి అమెరికాలోని టెక్సాస్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాగా.. ఈ విష సంస్కృతిని కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు సంస్కరణలు తీసుకువచ్చారు.  కాగా.. ఆ సంస్కరణలను విమర్శిస్తూ టెక్సాస్ గవర్నర్ కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

ఈ కాల్పులకు తెగబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బ్రయాన్ సిటీలోని పారిశ్రామిక పార్కులో కెంట్‌మూర్‌ క్యాబినెట్స్‌ అనే ఫర్నీచర్ తయారీ వేర్ హౌజ్ లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిని సెయింట్‌ జోసెఫ్‌ హెల్త్‌ రీజనల్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఆ సంస్థలో ఉద్యోగే అని పోలీస్‌ చీఫ్‌ ఎరిక్‌ బుస్కే తెలిపారు

కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకున్నారు. కాగా.. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.