‘‘నేను పాకిస్థానీనే కానీ.. పుల్వామా దాడిని ఖండిస్తున్నా’’ అంటూ ఇప్పుడు పాకిస్థానీ అమ్మాయిలు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  అంతేకాదు. ‘యాంటీ హేట్ చాలెంజ్’ పేరిట ఉద్యమాన్ని కూడా చేపట్టారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసింది. ఈ ఘటన భారతీయులను కలచివేసింది. కాగా.. ఈ ఘటనపై భారతీయులతోపాటు.. పాకిస్థానీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన ఓ అమ్మాయి.. భారత్ కి మద్దతుగా ప్రచారం చేస్తోంది. ఆమె పేరు సెహీర్‌ మీర్జా. వృత్తి జర్నలిస్టు. పెద్ద సంఖ్యలో సైనికులను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె బాహాటంగానే చెబుతోంది. 

భారత్‌కు మద్దతుగా ‘యాంటీ హేట్‌ చాలెంజ్‌’ను చేపట్టింది. ‘దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. దాని కింద.. ‘నేను పాక్‌ అమ్మాయిని...పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అనే ప్లకార్డుతో ఉన్న తన ఫొటోను పోస్ట్‌ చేసింది. భారత్‌కు మద్దతుగా తాను చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని ఆమె అందరినీ కోరుతోంది. 

ఆమె స్ఫూర్తితో పాక్‌లో చాలామంది మహిళలు మన దేశానికి బాసటగా నిలుస్తున్నారు. సెహీర్ లాగానే చాలా మంది పాక్ యువతులు సోషల్ మీడియాలో భారత్ కి మద్దతుగా ప్రచారం చేయడం గమనార్హం.