హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై మరోసారి భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆయన తన భూమిని ఆక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. మంత్రి నుండి తనను, తన భూమిని కాపాడాలని హెచ్ఆర్‌సిని వేడుకున్నారు. 

విషయమేంటంటే.... మేడ్చల్ జిల్లా సురారం భవాని నగర  కాలనీకి చెందిన శ్యామలాదేవికి స్థానికంగా 33 గుంటల భూమి వుంది. అయితే ఇది సరిగ్గా మంత్రి మల్లారెడ్డికి చెందిన హాస్పిటల్స్ కి  ఆనుకుని వుంది. దీంతో మంత్రి  కన్ను ఆ భూమిపై పడిందని... ఎలాగయినా దాన్ని దక్కించుకోవాలని తనను వేధించడం మొదలుపెట్టారని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. 

read more  హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం

అయితే ఈ  విషయంలో  రెవెన్యూ అధికారులు, పోలీసులు మంత్రికే మద్దతుగా పనిచేస్తున్నారని... వారికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా లాభం లేకపోవడంతో హెచ్ఆర్‌సి ఆశ్రయించాల్సి వచ్చిందని మహిళ ఆవేధన వ్యక్తం చేశారు. మంత్రి అనుచరులు తనను  చంపేస్తామని బెదిరిస్తున్నారని... వారివల్ల తన ప్రాణాలకు ప్రమాదం వుందని శ్యామలాదేవి ఆరోపించారు. 

ఆమె ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్‌సి వెంటనే విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి వచ్చే నెల 13వ తేదీన తమకు పూర్తిస్థాయి నివేదిక అందించాలని రాష్ట్ర డిజిపికి కమీషన్ ఆదేశించింది. సదరు మహిళకు కూడా రక్షణ కల్పించాలని సూచించింది.