హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం జరిగింది. వివాహేతర సంబందానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను చంపింది. ప్రియుడితో సాయంతో భర్తను హత్య చేసింది. హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట సీఐ రుద్ర భాస్కర్ ఆ వివరాలను అందించారు. 

చాంద్రాయణగుట్టలోని న్యూ ఇందిరానగర్ లో నివసించే మహమ్మద్ నాసెర్ (31) పక్క బస్తీకి చెందిన హలీమా బేగం అలియా గౌసియా (27)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. నాసెర్ గగన్ పహాడ్ లోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. 

గౌసియాకు పహడీషరీఫ్ కు చెందిన షేక్ బిలాల్ హుస్సేన్ (22)తో ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దానిపై భర్త భార్యను పలుమార్లు హెచ్చరించాడు.  దాంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని గౌసియా భావించింది. 

శనివారం రాత్రి హుస్సేన్ తో కలిసి భర్తను దిండుతో నొక్కి, తాడు గొంతు బిగించి చంపింది. ఆ తర్వాత అత్త మరియం బేగం ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి గొంతు నులిమి నాసెర్ ను చంపాడని చెప్పింది. మరియం బేగం ఘటనా స్థలానికి చేరుకుని కురుమాడుిని ఆస్పత్రికి తరలించింది. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. నాసెర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.