హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోరబండలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఓసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మళ్లీ శనివారం ఉదయం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు రాత్రి నుంచి ఆందోళనకు గురై నిద్ర కూడా పోలేదు. ఇళ్లలోంచి పరుగులు తీశారు.

బోరబండ ప్రాంతంలోని వీకర్స్ కాలనీ, అల్లాపూర్, రహమత్ నగర్ ల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి దాదాపు 15 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ బృందం పర్యటించనుంది.

రెండు రోజులుగా సీమ టపాకాయలు పేలినట్లు శబ్దాలు వచ్చాయి. చివరకు శుక్రవారం రాత్రి భూమి కంపించింది. శుక్రవారం రాత్రి నుంచి పలుమార్లు శబ్దాలు వస్తూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 2017లోనూ ఇలాగే ఈ ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 15 రోజుల తర్వాత అవి ఆగిపోయాయి. దాంతో వారు దాన్ని మరిచిపోయారు. 

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) అధికారులు భూప్రకంపనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. 2017లో కన్నా ప్రకంపనల తీవ్ర ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.