హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ కు తానే మందు కనిపెట్టేసినట్లుగా మాట్లాడుతున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అసలు విషయాన్ని వదిలిపెట్టి విషయం పక్కదారి పట్టించేందుకే సీఎం ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం అబద్దాల బడ్జెట్ అని లక్ష్మణ్ విమర్శించారు. 

బడ్జెట్ మొత్తం అంకెలగారడీతో సాగిందన్నారు. బడ్జెట్ లో అన్నింటిగురించి ప్రస్తావించి అప్పుల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కీలకమైన విషయాలను గాలికొదిలేసి అవసరం లేని  విషయాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం చేస్తుంటే ప్రజలదగ్గర ఏదో దాచాలని చూస్తున్నారని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ దాస్తున్న విషయాలను బైటపెట్టి  ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ తెలిపారు. 

read more  తెలంగాణలో కరోనా రాదు: కారణం చెప్పిన కేసీఆర్

హైదరాబాద్ లో ఎన్నికలు వుంటాయి కాబట్టే భారీగా నిధులు కేటాయించారని అన్నారు. పదివేల కోట్లతో నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని చెప్పుకుని ఓట్లు అడగొచ్చనేదే టీఆర్ఎస్ వ్యూహమన్నారు. లేదంటే ఇంతకాలం లేనిదే ఇప్పుడే హైదరాబాద్ అభివృద్దికి నిధులు కేటాయించాలని గుర్తుచుకువచ్చిందా అని  ప్రశ్నించారు. 

మజ్లీస్ పార్టీకి భయపడే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని అంటున్నారని... ఇది కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీకి తలొగ్గి  సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని లక్ష్మణ్ మండిపడ్డారు.