హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆదివారం నాడు అర్థరాత్రి ఐఎఎస్  అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరుగా శ్వేతా మహంతి నియమితులయ్యారు. ఆమె సోమవారం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

2011 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్వేతా మహంతి ఇప్పటివరకు వనపర్తి కలెక్టర్ గా ఉన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాదు జిల్లాకు కలెక్టరుగా వచ్చారు. హైదరాబాదు జిల్లా కలెక్టరు మాణిక్క రాజ్ కన్నన్ పరిశ్రమల శాఖ కమీషనర్ గా బదిలీ అయ్యారు. ఆయన నుండి శ్వేతా మహంతి దగ్గరి నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణలో జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో 65 మందికి స్థాన చలనం కలిగింది. సుమారు 50 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులు ఇచ్చింది. టాప్‌ లెవల్‌ నుంచి  2016 క్యాడర్‌ బ్యాచ్‌ వరకు బదిలీలు జరిగాయి.

బదిలీ అయిన ఐఏఎస్‌లకు కొత్తగా పోస్టింగ్‌లు కల్పించారు.బదిలీ అయిన ఐఏఎస్‌లలో మరికొంతమందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది ప్రభుత్వం.
మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎం జగదీశ్‌కు కీలక రెవెన్యూశాఖ కార్యదర్శి పదవి దక్కింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను నీటిపారుదలశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. 

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఉన్న రొనాల్డ్‌రోస్‌కు ఆర్థికశాఖ సెక్రటరీగా, అధర్‌సిన్హాకు పశుసంవర్థకశాఖ దక్కింది. సోమవారం మరికొన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని సమాచారం.ఇదిలా ఉండగా రాష్ట ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో)గా పనిచేస్తున్న రజత్‌కుమార్‌ ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి నియామకమైనందున ఆయన స్థానంలో మరొకరిని సీఈవోగా ప్రభుత్వం సూచించనుంది.