హైదరాబాద్: నియమాలను పట్టించుకోకుండా హైదరాబాదు వీధుల్లో తిరుగుతన్న సాఫ్ట్ వేర్ ఇంజనీరును పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హోం క్వారంటైన్ లో ఉండకుండా తల్లిదండ్రులతో కలిసి వీధుల్లోకి వచ్చాడు. 

దాంతో అతన్ని పట్టుకున్నారు. అతనికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. అతని తల్లిదండ్రులను హోం క్వారంటైన్ చేశారు. ఈ నెల 19వ తేదీన అతను ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్ సిటీలో తిరుగుతుండగా అతన్ని పట్టుకున్నారు. 

ఇదిలావుంటే, తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరు ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.

జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. సోమవారంనాడు 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య 36కు చేరింది

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పోలీసుల సాయంతో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలయ్యే విధంగా చూస్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై లాక్ డౌన్ అమలుయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.