అమీర్ పేట: ఆదివారం చెకెన్ కోసమని  ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అపార్ట్ మెంట్ సెల్లార్ లో అతన్ని పట్టుకున్న గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా రేపల్లె కు చెందిన కేశవ చంద్రశేఖర్ రాజు(25) సాప్ట్ వేర్ ఇంజనీర్. అతడికి గతేడాది లక్ష్మీగౌరి(22)తో వివాహమవగా ఇటీవలే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి ఆత్మహత్యకు భర్తా, అత్తామామలు అధనపు కట్నం కోసం వేధించడమే కారణమని అనుమానించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేశవ తో పాటు అతడి తల్లిదండ్రులపై కేసు నమోదయ్యింది. ఇటీవలే కేశవ బెయిల్ విడుదలై అమీర్ పేట లోని మేనమామ ఇంట్లో వుంటున్నాడు. 

 అయితే ఆదివారం ఉదయం చికెన్ తేవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చి అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి చేరుకున్న అతన్ని అప్పటికే అక్కడ కాపుకాచిన దుండగులు కత్తులతో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ  హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేశవ హత్యకు అతడి  అత్తింటివారే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.