హైదరాబాద్: నిన్న(ఆదివారం) జరిగిన డైట్ సెట్ పరీక్ష రాయడానికి వెళుతున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయి మృతిచెందారు. ఈ విషాద సంఘటన
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వస్తున్న వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలోనే నిన్న డైట్ సెట్ పరీక్షను నిర్వహించింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్, శ్వేత అనే ఇద్దరు విద్యార్థులు ఇంటినుండి పరీక్ష రాయడానికి బయలుదేరారు. ఇలా వీరు మదీనాగూడలో జాతీయ రహదారిపై వెళుతుండగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో పరీక్షకు వెళ్లాల్సిన వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు హాల్ టికెట్ల ఆదారంగా వారి పేర్లు, చిరునామాను తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు మియాపూర్ పోలీసులు.