హైదరాబాద్: అభం శుభం తెలియని ఓ ఏడాది చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసే ఓ దుండగుడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసి పరారవుతుండగా రాచకొండ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోని చిన్నారి తిరిగి తల్లి ఒడిలోకి చేరింది. 

ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోపాలపురం ప్రాంతానికి చెందిన ఓ దంపతుల ఏడాది కుమారున్ని బోడుప్పల్ కు చెందిన శంకర్ కిడ్నాప్ చేశాడు. అయితే తల్లిదండ్రులు కనిపించకపోవడంతో శంకర్ వద్ద వున్న బాలుడు ఏడవడం ప్రారంభించాడు. అయినప్పటికి పిల్లాడిని ఓదార్చే ప్రయత్నం చేయకుండా శంకర్ అలాగే తీసుకువెళ్లసాగాడు. 

అయితే ఈ దృశ్యం గస్తీ పోలీసుల కంట పడింది. అనుమానం వచ్చిన వారు నిందితుడిని పట్టుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. దీంతో మేడిపల్లి పోలీసులు గోపాలపురం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అలాగే నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.