హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో యువతిపై అత్యాచారం వెనక కుట్ర కోణం కూడా దాగి ఉన్నట్లు అర్థమవుతోంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ వృద్ధుడు దారుణమైన సంఘటకు పాల్పడ్డాడు. ఓ యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ 70 ఏళ్ల వృద్ధుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. 

పూర్తి ఆధారాలతో యువతి హైదరాబాదు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని 70 ఏళ్ల సలీముద్దీన్ గా పోలీసులు గుర్తించారు. 

ఓ యువతి సాయం కోసం అతన్ని ఆశ్రయించింది. తన ప్రియుడితో వివాహం జరిపించాల్సిందిగా ఆమె అతన్ని కోరింది. తప్పకుండా చేస్తానని చెప్పి తన ఇంట్లో ఉండాలని చెప్పాడు. అతను తనకు బంధువు కూడా కావడంతో నమ్మి ఉండిపోయింది. ఆమె ప్రియుడు కూడా అక్కడే ఉంటూ వచ్చాడు. అయితే, ఓ రోజు యువతి ప్రియుడితో కలిసి వృద్ధుడు మద్యం సేవించాడు. 

ఆ సమయంలో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ యువతికి ఇచ్చాడు. అది తాగిన ఆమె స్పృహ తప్పింది. దాంతో ఆమెపై వృద్ధుడు లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను ఆమె ప్రియుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ తర్వాత తన విలువైన గడియారాన్ని యువతి తీసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అయితే, తగిన ఆధారాలతో యువతి పోలీసు కమిషనర్ ను ఆశ్రయించింది. దాంతో సలీముద్దీన్ పై, యువతి ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.