హైదరాబాద్: తోటి హిజ్రాను ఓ హిజ్రా గ్రూప్ అతి దారుణంగా చంపడానికి ప్రయత్నించిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన హిజ్రా హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ ఎర్రగడ్డలో నివాసముంటున్న హంస(28) అనే హిజ్రాకు చందానగర్ లో వుండే ఓ హిజ్రా గ్రూప్ తో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమెను హతమార్చడానికి సదరు హిజ్రా గ్రూప్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా మాట్లాడుకుని విభేధాలను పరిష్కరించుకుందామని చెప్పి సదరు గ్రూప్ హంసను హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్దకు రమ్మని పిలిచారు. వారి మాటలు నమ్మిన హంస ఒంటరిగానే అక్కడికి వెళ్ళింది. 

ఈ సందర్బంగా మరోసారి హంసకు హిజ్రా గ్రూప్ సభ్యులను మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అప్పటికే పథకం ప్రకారం తమవెంట తెచ్చుకున్న పెట్రోల్ ను హంసపై చల్లి నిప్పటించారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 

మంటల్లో చిక్కుకుని దహనమవుతున్న హంసను కాపాడిన స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. శరీరం మొత్తం కాలిపోవడంతో ప్రస్తుతం హంస పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.