హైదరాబాద్: కంచే చేనును మేసింది అన్నట్లుగా కాపాడాల్సిన వాడే మహిళను కాటేయడానికి ప్రయత్నించిన సంఘటన హైదరబాద్ లో చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన గౌరవప్రదమైన పోలీస్ విభాగంలో పనిచేస్తూ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఏఎస్సైపై వేటు పడింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ మీర్ పేట స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగంలో నరేందర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌ఫెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు ఓ కేసు విచారణలో భాగంగా ఓ ఇంటికి వెళ్లాడు.  ఇంట్లో ఒంటరిగా వున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ  ఇంటివారు ఆరోపించారు. అంతేకాకుండా సదరు మహిళ షీటీమ్ కు ఫోన్ చేసి తనతో ఏఎస్సై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. 

read more  అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని చంపేసి గోనెసంచీలో మూట కట్టింది

దీంతో ఏఎస్సై నరేందర్ ను అదుపులోకి తీసుకుంది షీటీమ్ బృందం. పోలీస్ శాఖకు చెందిన వ్యక్తి కావడంతో అతన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సిపి వెంటనే సదరు పోలీసును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ సాగుతుందని సిపి తెలిపారు. 

పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన వారిని ఉపేక్షించబోమని సిపి హెచ్చరించారు. ప్రజలతో గౌరవప్రదంగా వుండాలని పోలీసులకు సూచించారు. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో చాలా కఠినంగా వుండాలని... ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని సిపి హెచ్చరించారు.