హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల వైష్ణవి ఆస్పత్రిలో విషాద సంఘటన జరిగింది. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోనే ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తనను నలుగురు వేధిస్తున్నారంటూ అజయ్ కుమార్ తన డైరీలో రాసుకున్నాడు. వారి పేర్లను కూడా వెల్లడించాడు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా దొరికింది. 

తుర్కయంజాల్ కు చెందిన కాంగ్రెసు నేత శివకుమార్, ఆస్పత్రి భవనం యజమాని కరుణాకర్ రెడ్డి, అతని బావమరిది కొండల్ రెడ్డి, సరస్వతీనగర్ కాలనీ ప్రెసిడెంట్ మేఘా రెడ్డి తన మరణానికి కారణమని ఆయన చెప్పాడు. 

వారు నలుగురు తనను మానసికంగా హింసకు గురి చేయడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాశాడు. డాక్టర్ అజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.