హైదరాబాద్: చదివింది ఏడో తరగతి మాత్రమే గానీ హైదరాబాద్ సల్మాన్ మామూలోడు కాడు. పబ్జీ గేమ్ ఆడడంలో దిట్ట. ఆ ఆటను ఆసరా చేసుకని అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. వారిని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరిస్తాడు. ఆ తర్వాత తాను పిలిచినప్పుడల్లా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని బెదిరిస్తూ వస్తున్నాడు. 

తనతో సన్నిహితంగా గడపాలని, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాదులోని టోలీచౌకికి చెందిన సల్మాన్ (24) నాంపల్లిలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 

పబ్జీ గేమ్ ఆడుతుండగా ఆరు నెలల క్రితం హైదరాబాదు పాతబస్తీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థినితో పరిచయం అయింది. ఆమె వాట్సప్ నెంబర్ తీసుకుని మెసేజ్ లు పెడుతూ వచ్చి మిత్రుడిగా మారాడు. తర్వాత ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు. అతని ప్రేమను అంగీకరించిన ఆమె అతనికి సన్నిహితంగా మెలిగింది. 

తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపించింది. వాటిని సోషల్ మీడియాలో పెడుతానని, మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మొబైల్ ఆధారంగా లోకేషన్ ను గుర్తించి సల్మాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎక్కువగా అమ్మాయిల నెంబర్లు ఉండడాన్ని వారు గుర్తించారు. వివిధ కోణాల్లో సల్మాన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.