హైదరాబాద్: జనతా కర్ఫ్యూ కారణంగా రేపు ఆదివారం హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. మెట్రో కు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్ ను కూడా మూసి వేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా కూడా జనతా కర్ఫ్యూలో పాలు పంచుకోవాలని కోరారు. 

అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆయన కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్ళను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఇదిలావుంటే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఈనెల 22న జ‌రిగే జ‌న‌తా క‌ర్ఫ్యూకు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) పూర్తి మద్దతు ప్రకటించింది. ఐటీ విద్యార్థులు, టెక్కీలు 22న ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు ఇంట్లోనే ఉండి ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి కోవిడ్‌-19 ఆన్‌లైన్‌ హ్యాక‌థాన్ లో పాలుపంచుకోనున్నారని టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల ప్రకటించారు. 

ప్రాణాంత‌క వ్యాధిని అరిక‌ట్టే ల‌క్ష్యంతో సాగుతున్న ఈ 'కోవిడ్‌-19 ఆన్లైన్ హ్యాక‌థాన్', ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విస్త‌ర‌ణ‌ను అడ్డకునేందుకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు చూపుతుందని సందీప్ మక్తాల తెలిపారు. టీటా ఎన్నారై చాప్ట‌ర్ల ద్వారా వివిధ దేశాల‌కు చెందిన అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యులు సైతం ఈ హ్యాక‌థాన్ పాలుపంచుకోనున్నారు.