హైదరాబాద్: రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ. ఆ వెంటనే స్ధానికసంస్థల ఎన్నికల్లోనూ అదే ఊపు. ఉపఎన్నికల్లోనూ సెంటిమెంట్స్ ను పటాపంచలు చేస్తూ  ఘన విజయం. తాజాగా మున్సిపల్, సొసైటీ ఎన్నికల్లోనూ కొనసాగిన హవా. ఇది టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు. రెండోసారి అధికారాన్ని చేపట్టింది మొదలు ఇప్పటివరకు ఆ పార్టీ ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. దీంతో పనిలోపనిగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కూడా ముందస్తుగానే జరిపే అవకాశం వుందంటూ ప్రచారం జరుగుతోంది. 

రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు తప్ప మరే రకమైన ఎన్నికలు లేవు. దీంతో వీలైనంత  తొందరగా ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం  జరుగుతోంది. ఆ ఎన్నికలకు ఇంకా సమయం వున్నా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ముందస్తుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు... అందుకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తాజాగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు. 

read more  నా రాజకీయ జీవితంలో చూసిన గొప్ప సీఎం ఆయనే..: మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

ప్రస్తుత పాలకవర్గం పూర్తికాలం పనిచేస్తుందని... ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని మేయర్ స్పష్టంచేశారు.  ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. కాబట్టి గడువు ముగిసిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని మేయర్ వెల్లడించారు. 

హైదరాబాద్ అభివృద్దికి రాష్ట్ర బడ్జెట్ లో భారీ నిధులు కేటాయించిన నేపథ్యంలో గ్రేటర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు టీఆర్ఎస్ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

read more  హీరోలమైనా లాబీయింగ్ చేసుకునేవాళ్ల ముందు జీరోలమే: జగ్గారెడ్డి