హైదరాబాద్: హైదరాబాదులోని అడ్డగుట్ట హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య గొడవనే భర్త హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. తుకారాంగేట్ ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప ఈ విషయం తెలిపారు. 

ఆజాద్ చంద్రశేఖర్ బస్తీకి చెందిన రవికుమార్ (50), పద్మావతి (43) దంపతులు. వారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

పెళ్లి కావాల్సిన బిడ్డ కోసం దంపతుల మధ్య నిత్యం గొడవ జరుగుతుండేది. డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం రవికుమార్ మద్యం సేవించి ఇట్టికి వచ్చాడు. ఇలా తాగుతుంటే బిడ్డ పెళ్లి ఎలా చేస్తావంటూ పద్మావతి నిలదీసింది. దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 

ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో పద్మావతి పక్కనే ఉన్న నైలాన్ తాడుతో భర్త గొంతు బిగించింది. దాంతో రవికుమార్ మరణించాడు. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడని బస్తీవాసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే, పోస్టుమార్టంలో అది హత్య అని తేలింది. దాంతో పోలీసులు సోమవారంనాడు పద్మావతిని విచారించారు. దాంతో ఆమె నేరం అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.