హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం వినాయక చవితి ఉత్సవాలపై పడింది. కరోనా వైరస్ ప్రభావం ఖైరతాబాద్ వినాయకుడిపై పడింది. అత్యంత ఎత్తుగా, భారీగా ఏర్పాటయ్యే ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి అనూహ్యంగా ఎత్తు తగ్గనున్నాడు.

ఖైరతాబాద్ విగ్రహాన్ని కేవలం ఒక్క అడుగు ఎత్తులోనే స్థాపించాలని గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యేటా హైదరాబాదులో పెద్దయెత్తున వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 22వ తేదీన ఈసారి వినాయక చవితి వస్తోంది. ఆగస్టు 21లోపల కరోనాకు వ్యాక్సిన్ రాకపోతే విగ్రహం ఒక అడుగు ఎత్తులోనే ఉంటుంది. 

ఈ నెల 18వ తేదీ కర్రపూజా కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రత్యేకంగా సమావేశం కావాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేసే యోచనలో కమిటీ ఉంది.

నిరుడు ఖైరతాబాదు వినాయకుడు 61 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యాడు. ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమిచ్చాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్వాలతో ఏర్పాటయ్యాడు. ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది. 

1954లో తొలిసారి ఖైరతాబాద్ విగ్రహం కొలువు దీరింది. అప్పట్నుంచి విగ్రహాన్ని ఒక్కో అడుగు చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. నిరుడు 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చైంది.  దాన్ని రూపుదిద్దడానికి 150 మంది కళాకారులకు నాలుగు నెలల సమయం పట్టింది.