హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ చిరుతపులి కలకలం సృష్టించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో హైదరాబాదులోని కాటేదాన్ ప్రాంతంలో జాతీయ రహదారిపై చిరుతపులి పడుకుని ఉంది. చిరుత గాయపడి రోడ్డుపై పడుకుందని భావించారు. 

మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై పడుకుని ఉన్న చిరుతను చూసిన కొంత మంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు చిరుతపులి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. 

అయితే ఇంతలో ఓ లారీ డ్రైవర్ దాన్ని చూడడానికి దగ్గరగా వెళ్లాడు. కాకినాడకు చెందిన ఆ లారీ డ్రైవర్ పై చిరుతపులి పంజా విసిరి పారిపోయింది. చిరుతపులి దాడిలో అతను గాయపడ్డాడు. గాయపడిన లారీ డ్రైవర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

అడవిలోకి పారిపోయిన చిరుతపులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకోవాలనేది వాళ్ల ఆలోచన. కనిపించిన వెంటనే పట్టుకుంటామని వారంటున్నారు.