హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదు నగర పాల సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కంటోన్మెంట్ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సికింద్రబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడు రామకృష్ణ రాజీనామా చేశారు. 

సహచర సభ్యుల్లోని కొందరి వేధింపులు తట్టుకోలేక, వారితో ఉన్న విభేదాల కారణంగా టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జె. రామకృష్ణ ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని ప్రకటించారు. ప్రజలను, సహచరులను, శ్రేయోభిలాషులను సంప్రదించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. 

టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రామకృష్ణ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రామకృష్ణ ఈ నెల 20వ తేదీ లోపు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇటీవల ప్రకటించారు. 

ఆ నేపథ్యంలోనే రామకృష్ణ టీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు అర్థమవుతోంది. బోర్డులోని ఏడుగురు సభ్యులు పార్టీకి అనుకూలంగా ఉన్నారు. పార్టీ అదేశిస్తే రామకృష్ణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మిగతా సభ్యులు అనుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యుల పదవీ కాలాన్ని రక్షణ శాఖ రెండోసారి పొడగించింది. దీంతో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. రక్షణ శాఖ తలుచుకుంటే ఈ లోపు ఎన్నికలు నిర్వహించవచ్చు.

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మరో మాజీ ఉపాధ్యక్షురాలు బాణుక నర్మద భర్త బాణుక మల్లిఖార్జున్ లకు ఫోన్ చేసి పికెట్ లోని అంబేడ్కర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు రావాలని ఆహ్వానించారు. వారితో కలిసి వార్డుల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు.