హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పేలుడు సంభవించింది. హైదరాబాదులోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గల ఓ చెత్తకుప్పలో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

పేలుడు సంభవించిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. తాము కుప్పలు కొడుతుంటే భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ పేలుడు ధాటికీ అటుగా వెళ్తున్న ఓ బాలిక ఎగిరి కిందపడిపోయిందని చెప్పారు. 

పేలుడు సంభవించిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రసాయనాల వల్ల ఈ పేలుడు సంభవించిందా, జిలిటెన్ స్టిక్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చెత్తకుప్ప వద్ద ప్లాస్టిక్ సంచులు, ఇతర పదార్థాలు ఉన్నాయని అంటున్నారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.