హైదరాబాద్: రోడ్డుపై వెళుతుండగా అమ్మాయిని వేధించిన ఆకతాయిని ఇదేంటని ప్రశ్నించినందుకే ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును మందలించి బుద్ది చెప్పాల్సింది పోయి ప్రశ్నించిన వ్యక్తిపైనే దాడిచేసి అతి దారుణంగా హతమార్చాడో కంత్రీ తండ్రి. ఈ దారుణం హైదరాబాద్ లో జరిగింది. 

కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన పావని(28) స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆమె సోదరుడు పవన్ తో కలిసి బైక్ పై వెళుతుండగా సందీప్ అనే ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. తన ఎదుటే సోదరిని వేధించడాన్ని తట్టుకోలేకపోయినప్పటికి కామెంట్స్ చేసి తమను ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లిన సందీప్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో జాలిపడిన పావని, ఆమె సోదరి అతడిని ఏమనకుండా వెళ్లిపోయారు. 

అయితే ఈ విషయాన్ని సందీప్ ఇంటి సమీపంలో వుండే తన మిత్రుడు సురేష్ గౌడ్ కు తెలిపాడు పవన్. దీంతో మందలించడానికని ఒంటరిగా వెళ్లిన సురేష్ తో సందీప్, అతడి తండ్రి విజయ్ బోస్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే విజయ్ బోస్ ఇంట్లోంచి కత్తిని తీసుకువచ్చి సురేష్ ను విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో అతడు రక్తపుమడుగులో అక్కడే కుప్పకూలాడు. హాస్పిటల్ కు తరలించినప్పటికి అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతిచెందాడు.