హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. హైదరాబాదుకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం వర్షం తెరిపి ఇచ్చింది. పొడి వాతావరణం నెలకొంది. అయితే, గురువారం సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాదుకు ఢిల్లీ నుంచి 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. హైదరాబాదులోని వందలాది కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఫలక్ నుమాతో పాటు పలు పాతబస్తీ కాలనీలు నీటిలో మునిగి ఉన్నాయి. ఇప్పటి వరకు వేయి కుటుంబాలు వరదల్లోనే చిక్కుకుని ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లోని పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ కు పెద్ద యెత్తున వరద నీరు చేరుకుంటోంది. 

ఇదిలావుంటే, పోలీసుల హెచ్చరికలు బేఖతారు చేస్తూ వరదలోనూ ముందుకు వెళ్లిన ఇద్దరు కారు ప్రయాణికులు మృత్యువును కౌగలించుకున్నారు. చెరువుగట్టుకు వెళ్లడానికి కారులో ఇద్దరు మిత్రులు బయలుదేరారు. ప్రమాదం పొంచి ఉందని ముందుకు వెళ్లవద్దని పోలీసులు వారిని హెచ్చరించారు. అయితే వారు వినలేదు.

ముందుకు వెళ్లే క్రమంలో కారు మూసీ వరదలో కొట్టుకుపోయింది. రక్షణ కోసం మిత్రులకు వారు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. కారులో కొట్టుకుపోయినవారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారంనాడు వేంకటేష్ మృతదేహం లభ్యం కాగా, గురువారంనాడు రాఘవేంద్ర మృతదేహం లభించింది.

ఇప్పటి వరకు హైదరాబాదులో 15 మంది వర్షానికి మరణించారు. మరో ఇద్దరి మృతితో ఆ సంఖ్య పెరిగింది. తెలంగాణలో వర్షాల కారణంగా 30 మంది మరణించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాదులో వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. 

బార్కాస్ లో నీటిలో కొట్టుకుపోతూ కనిపించిన వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు అతన్ని కాపాడారు. ఐదుగురు వ్యక్తులు వరదల్లో గల్లంతయ్యారు. వరదల ప్రమాదం కారణంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.  

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు బలగాలు సైనిక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు పడవలను ఉపయోగిస్తున్నారు. హిమాయత్ సాగర్, రిజర్వాయర్ 15 గేట్లను తెరిచారు. హుస్సేన్ సాగర్, నగరంలోని చెరువుల నీరు మూసీలోకి ప్రవహిస్తోంది. దీంతో మూసీ నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. 

చాదర్ ఘాట్, మలక్ పేట, జియాగుడా, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లో మూసీ నదికి ఇరువైపులా వంద మీటర్ల మేర వరద చేరింది. 

బుధవారం నుంచి హైదరాబాదులో వర్షం తెరిపి ఇచ్చినా ఇంకా చాలా కాలనీలు నీటిలోనే మునిగి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కరెంట్ పునరుద్ధరణ జరగలేదు.